ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
పాడేరు రూరల్: ప్రజారోగ్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. మండలంలో మినుములూరు పంచాయతీ పరిధిలోని కందమామిడి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యాసామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం పాఠాలను బోధించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల, వసతి గృహంలో పరిసరాలు పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విద్యార్థులు, పాఠశాల నిర్వాహకులను సూచించారు. ఎప్పటికప్పు ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయాలని ఆదేశించారు. డయేరియా, మలేరియా తదితర వ్యాధులు ప్రబలకుండా జాగ్రతలు తీసుకోవలన్నారు. అనంతరం మినుములూరు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికహారంలో ఎటువంటి నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.


