సీలేరు: గూడెంకొత్తవీధి మండలం సీలేరు గురుకుల పాఠశాలను ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మెనూ సక్రమంగా అమలుచేయడంలేదని విద్యార్థులు పీవో వద్ద వాపోయారు. దీంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. డిప్యూటీ వార్డెన్ నిర్వహణ తీరుపై ఆమె ఆగ్రహం చెంది తక్షణమే మార్పు రావాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఇందులో భాగంగా పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, అమలుచేయని మెనూ, అస్తవ్యస్త నిర్వహణపై అసహనం చెంది, ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం భోజనం అందించడంలో లోపాలు ఉన్నట్టు గుర్తించి ప్రిన్సిపాల్‌కు హెచ్చరించారు. అంతేకాకుండా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించిన అధికారి, కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయని, విద్యార్థులకు కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధునిక విద్యను అందించాల్సిన చోట ఈ నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ పర్యవేక్షణ సరిగా చేయడం లేదని గుర్తించి ఇకపై ఇలాంటి లోపాలు జరగకూడదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ, ప్రాక్టికల్స్ విషయంలో నిర్లక్ష్యం తగదు అని ప్రిన్సిపాల్ కు కఠినంగా సూచించారు. విద్యార్థిని, విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని హితవుపలికారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపపాల్ తదితరులు పీవో దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా, బోరు రిపేరు చేయించాలని, వాటర్ ట్యాంకులను మంజూరు చేయాలని కోరారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, ప్రమాణాలతో కూడిన విద్య అందించడానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
‘మెనూ సక్రమంగా అమలు చేయించండి మేడం’


