రోడ్డెక్కిన కాఫీ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన కాఫీ కార్మికులు

Nov 7 2025 7:10 AM | Updated on Nov 7 2025 7:10 AM

రోడ్డ

రోడ్డెక్కిన కాఫీ కార్మికులు

న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

పాడేరు, చింతపల్లిలో ఏపీఎఫ్‌డీసీ కార్యాలయాల ఎదుట ధర్నా

యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన

సమ్మెకు దిగడంతో నిలిచిన పండ్ల సేకరణ

సాక్షి,పాడేరు: న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కరించాలని ఇప్పటివరకు డిమాండ్‌ చేసిన కాఫీ కార్మికులు గురువారం రోడ్డెక్కారు. ఏపీఎఫ్‌డీసీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై ధ్వజమెత్తుతూ సమ్మెబాట పట్టారు. పాడేరులోని మినుములూరు, చింతపల్లి, ఆర్‌వీనగర్‌ పరిధిలోని కాఫీ కార్మికులు, హెల్పర్లు విధులను బహిష్కరించారు. దీనిలో భాగంగా జిల్లాకేంద్రం పాడేరులోని ఏపీఎఫ్‌డీసీ డీఎం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

నిర్లక్ష్యం తగదు

కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఏపీఎఫ్‌డీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ నేత సుందరరావు విమర్శించారు. గత ఏడాది ఆక్టోబర్‌లో రోజువారి కూలీ రూ.400 చెల్లిస్తామని హమీ ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు.ఈ ఏడాది కూడా రోజువారి కూలి సొమ్ము పెంచడంతో పాటు కార్మికులు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

10న కార్మికులతో చర్చలు : డీఎం కృష్ణబాబు

పాడేరు ఏపీఎఫ్‌డీసీ కార్యాలయం ఎదుట కాఫీ కార్మికులు,హెల్పర్లు ధర్నా చేయడంపై డీఎం గెమ్మెలి కృష్ణబాబు స్పందించారు. అక్కడకు చేరుకున్న ఆయన కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు.ఈనెల 10వతేదిన కాఫీ కార్మికులతో సమావేశం నిర్వహిస్తామని, అన్ని సమస్యలు పరిష్కారానికి చర్చిస్తామని హమీ ఇచ్చారు. డీఎం హమీతో కాఫీ కార్మికులు, హెల్పర్లు ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించారు.

చింతపల్లి: ఏపీఎఫ్‌డీసీ పరిధిలో పనిచేస్తున్న కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్‌ హెచ్చరించారు.గురువారం స్థానిక ఏపీఎఫ్‌డీసీ డివిజనల్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. స్థానిక పాత బస్టాండ్‌ నుంచి మండల కార్యాలయాలు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మూడు వారాల క్రితమే సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేసినా స్పందన కరువైందన్నారు. గత ఏడాది సంస్థ యాజమాన్యంతో జరిపిన చర్చల్లో హెల్పర్లు తప్ప మరే ఇతర సమస్యలు పరిష్కరించలేదన్నారు. వీడీఏ పాయింట్లకు అనుగుణంగా పండ్ల సేకరణ ధర, కూలిరేట్లు పెంచాలని కోరినా ఫలితం లేదన్నారు.సంస్థ యాజమాన్యం నిర్లక్షపు ధోరణికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మె చేపట్టాల్సి వచ్చిందన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కాఫీ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కొర్రా రాజు, మాజీ అధ్యక్షులుక నకవల్లి, నాయకులు మోరి గిరి, రాజారావు, వెంకటేష్‌, బాబూరావు, నగేష్‌, బలరాం పాల్గొన్నారు. దీంతో ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటల్లో పండ్ల సేకరణ నిలిచిపోయింది.

రోడ్డెక్కిన కాఫీ కార్మికులు 1
1/2

రోడ్డెక్కిన కాఫీ కార్మికులు

రోడ్డెక్కిన కాఫీ కార్మికులు 2
2/2

రోడ్డెక్కిన కాఫీ కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement