ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
పాడేరు : జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. మండలంలోని డోకులూరు గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులతో మాట్లాడారు. గిరిజన రైతు స్థాపించిన బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన బయో ఇన్‌పుట్స్ తయారీ, వాటి వినియోగం, గడువు తేది తదితర అంశాలను రైతు కృష్ణారావుతో కలెక్టర్ చర్చించారు. ఆయన కృషిని ప్రసంసించారు. విత్తన ప్రదర్శనను తిలకించారు. ప్రదర్శనలో 65కు పైగా దేశి విత్తన రకాలు వాటి ప్రాధాన్యతను తెలుసుకున్నారు. విత్తనాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి రైతులు సంప్రదాయ విత్తనాల వినియోగం పెంచాలన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌తో సమావేశమయ్యారు. శిక్షణ విధానాలు, ప్రాక్టికల్ మోడల్స్ గురించి తెలుసుకున్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేసేలా గిరిజన రైతులను ప్రోత్సహించాలన్నారు. బయోడైవర్సిటి ప్లాట్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి. బాబురావు నాయుడు, డీపీఎం భాస్కర్‌రావు పాల్గొన్నారు,


