గిట్టుబాటు ధరేది?
● కొనుగోలు ధర ప్రకటనలో జాప్యం
● ఉలుకుపలుకూ లేని జీసీసీ
● ఐటీడీఏ మౌనం
● అయోమయంలో గిరి రైతులు
కాఫీ పండ్లను సేకరిస్తున్న గిరిజన మహిళ
సాక్షి, పాడేరు: జిల్లాలో పాడేరు డివిజన్ పరిధిలో 1.50లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఏటా సుమారు 17వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను గిరిజన రైతులు విక్రయిస్తారు. కాఫీ గింజల కొనుగోలు ధరల ప్రకటనలో గిరిజన సహకార సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
– కాఫీ గింజల సీజన్‌కు ముందే జీసీసీ అపెక్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి పాచ్‌మెంట్, చెర్రీ రకం కాఫీ గింజల కొనుగోలు ధరలను ప్రకటించాల్సి ఉంది.అయితే నవంబర్ నెల ప్రారంభమై,గిరిజన రైతులు కాఫీ పండ్ల సేకరణ చేపడుతున్న ఇంతవరకు జీసీసీ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. గతేడాది పాచ్‌మెంట్‌ను కిలో రూ.40, చెర్రీ రకం కిలో రూ.250 చొప్పునర 752 టన్నులను మాత్రమే కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు ధరలు ప్రకటించకపోవడంతో కొనుగోలు విషయంలో ఆ సంస్థ వైఖరి కాఫీ రైతులకు అర్థం కావడం లేదు.
– పాడేరు ఐటీడీఏ కూడా కాఫీ పండ్ల ఽకొనుగోలు ధరను ప్రకటించడంలో ఆలస్యం చేస్తోంది. గతేడాది కాఫీ పంటను పండ్ల దశలోనే కిలో రూ.43 ధరతో చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా ఐటీడీఏ కొనుగోలు చేసింది. సుమారు 5వేల కిలోల వరకు కాఫీ పండ్లను ఐటీడీఏ సేకరించింది.అయితే ఈ ఏడాది సీజన్ ప్రారంభమైనా కాఫీ పండ్ల ధరను ఐటీడీఏ ప్రకటించలేదు. ప్రస్తుతం సేకరించిన పండ్లను ప్రైవేట్ వ్యాపార సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఐటీడీఏ ధర ప్రకటన కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.
మన్యం కాఫీ గింజలకు గిరాకీ
నాణ్యతలో నంబర్ వన్‌గా నిలుస్తున్న మన్యం కాఫీగింజలకు బెంగళూరు కాఫీ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. గత ఏడాది మన్యం నుంచి పంపిన కాఫీ పాచ్‌మెంట్ గింజలకు కిలో రూ.500ధరతో వ్యాపారం జరిగింది. ఈ ఏడాది మాత్రం ఇదే ధరతో మన్యంలో జీసీసీతో పాటు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీలో 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ఎకరాకు 600కిలోల మేర పండ్లు దిగుబడి వస్తుంది. వీటిని గిరిజన రైతులు అమ్మకుండా పల్పింగ్ చేసి పాచ్‌మెంట్ కాఫీ గింజలుగా తయారు చేసుకుంటే సుమారు 200 కిలోల దాటే మార్కెట్ చేస్తారు. గత ఏడాది కిలో రూ.400 ధరతో అమ్ముకున్న గిరిజన రైతులు ఎకరానికి రూ.80 వేల వరకు ఆదాయం పొందారు. నాణ్యమైన కాఫీ గింజల దృష్ట్యా ఈ సీజన్‌లో కిలో పాచ్‌మెంట్ రూ.500, పండ్లు కిలో రూ.100 ధరకు కొనుగోలు చేయాలని కాఫీ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో కొనుగోలు ధర ప్రకటన
ఈసీజన్‌లో కాఫీ పంటకు గిట్టుబాటు ధర కల్పించి గిరిజన రైతులకు న్యాయం చేస్తాం. జీసీసీ అధికారులతో మాట్లాడడం జరిగింది.అపెక్స్ కమిటీ సమావేశం ఈవారంలో నిర్వహించి జీసీసీ ద్వారా పాచ్‌మెంట్, చెర్రీ రకం కాఫీ గింజల కొనుగోలు ధరలు ప్రకటిస్తాం.ఐటీడీఏ పండ్ల కొనుగోలు ధరపై సమావేశం నిర్వహిస్తాం.
– ఏఎస్ దినేష్‌కుమార్, కలెక్టర్, పాడేరు
కిలో రూ.500కు కొనాలి
గత ఏడాది బెంగళూరు మార్కెట్‌లో అధిక ధరలతో జీసీసీతో పాటు అన్ని వ్యాపార సంస్థలు కాఫీ గింజలను అమ్మి మంచి లాభాలు పొందాయి. గిరిజన రైతుల వద్ద మాత్రం ప్రారంభంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసం చేశాయి. ఈ ఏడాది కిలో రూ.500తో పాచ్‌మెంట్‌ను జీసీసీ కొనుగోలు చేయాలి.
– పాలికి లక్కు,
కాఫీ రైతుల సంక్షేమ సంఘ ప్రతినిధి, పాడేరు
కాఫీ పండ్లు కిలో రూ.100కు అమ్ముతాం
కాఫీ పండ్లను కూడా ఐటీడీఏ,పలు రైతు ఉత్పత్తి సంఘాలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.గత సీజన్‌లో ఐటీడీఏ కిలో రూ.43తో పండ్లను కొనుగోలు చేయడంతో తామంతా మోసపోయాం. ఈసీజన్‌లో కిలో పండ్లను రూ.100 ధరతో అమ్మాలని నిర్ణయించాం.
– మర్రి జ్యోతి, కాఫీ మహిళా రైతు,
గుర్రగరువు, పాడేరు మండలం
గిట్టుబాటు ధరేది?
గిట్టుబాటు ధరేది?
గిట్టుబాటు ధరేది?


