మాతాశిశు మరణాలు తగ్గించాలి
పాడేరు : మాతా, శిశు మరణాలు సంభవించకుండా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నుంచి వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సికిల్‌సెల్ ఎనీమియా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి వ్యాధి నిర్థారణ అయితే తగిన వైద్యం అందించాలని సూచించారు. గర్భిణులకు మెరుగైన వైద్యం కల్పించాలన్నారు. పీహెచ్‌సీల పోర్టల్‌లో గర్భిణుల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి ప్రభుత్వం కల్పించిన వైద్య సదుపాయాలు తప్పనిసరిగా అందజేయాలన్నారు. గర్భధారణ ప్రారంభంలోనే అనారోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందజేయాని సూచించారు. పిల్లలలో సంభవించే గవద బిల్లలు, రుబెల్లాను గుర్తించి ఎంఎంఆర్ టీకా ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు మెరుగైన పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కిశోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శద్ధ తీసుకోవాలని సూచించారు. సీడీపీవోలంతా క్షేత్ర పర్యటన చేసి అంగన్‌వాడీ కేంద్రాల్లో టీకాలు సక్రమంగా వేసేలా చూడాలన్నారు. గర్భిణులు, రోగులను అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు తరలించేందుకు ఫీడర్, 108,104 అంబులెన్స్‌లను 24గంటల పాటు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు గ్రామాల్లో పంచాయతీ సిబ్బందితో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలన్నారు. మురుగు కాలువల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమతెరలను సక్రమంగా వినియోగించేలా గిరిజనులను ప్రోత్సహించాలన్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డులతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీపడాల్, జిల్లా మలేరియా అధికారి తులసి పాల్గొన్నారు.
ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవోతిరుమణి శ్రీపూజ


