రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన

Nov 3 2025 6:36 AM | Updated on Nov 3 2025 6:36 AM

రాష్ట

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన

పాడేరు : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన చోటుచేసుకుందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. కాశీబుగ్గ ఘటనలో మృతులకు సంతాపంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం పాడేరు పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులకు ప్రత్యేకమైన దినాల్లో ఆలయాల్లో తీవ్ర రద్దీ ఉంటుందని తెలిసి కూడా సరైన భద్రత ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు. ఫలితంగా భక్తుల రద్దీ అధికమై తొక్కిసలాట జరిగిన ఏకంగా తొమ్మిది మంది భక్తులు మృతి చెందారని, పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారన్నారు. జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. జరిగిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతోనే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు కూటమి నేతలు పూనుకుంటున్నారన్నారు. కల్తీ మద్యం కేసులో ఏ మాత్రం సంబంధం లేని వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఉన్నట్టుండి అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ప్రజల దృష్టికి మరల్చేందుకే కూట మి ప్రభుత్వం అరెస్ట్‌ల డ్రామా ఆడుతోందన్నారు. కల్తీ మద్యం ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని జోగి రమేష్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో బడికి, గుడికి వెళ్లిన వారికి ఏమాత్రం రక్షణ లేదనడానికి గత 17 నెలల్లో సంఘటనలే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్‌, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా సుబ్రమణ్యం, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పాంగి నాగరాజు, కన్నాపాత్రుడు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, పార్టీ సీనియర్‌ నాయకులు వంతాల నరేష్‌, బూరా మహేష్‌, కిల్లు కోటిబాబు నాయుడు, మోదా బాబురావు, రాజేష్‌ పాల్గొన్నారు.

కాశీబుగ్గ ఘటన బాధాకరం:

ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకులోయ టౌన్‌: కాశీబుగ్గ చిన తిరుపతి స్వామి వారి ఆలయంలో భక్తుల తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందడం, 37మంది గాయాలు పాలు కావడం చాలా బాధాకరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం అరకులోయ వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద ఆయన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల తొక్కిసలాట రుద్ర భూమిని తలపించిందన్నారు. కార్తీక ఏకదశి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తే కనీసం సెక్యూరిటీ కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఆలయం, పరిసరాలు, రోడ్లు కిక్కిరిసిపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ పాడి రమేష్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గెడ్డం నర్సింగరావు, పార్టీ ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్‌ కుమార్‌, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌, మాడగడ పీసా కమిటీ అధ్యక్షుడు ఎం. బాలరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు బంగురు శాంతి, పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్‌, గుంజిడి ప్రసాద్‌, బీబీ కామేష్‌, ఎల్‌బీ కిరణ్‌ కుమార్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

భక్తుల రద్దీ ఉన్న ఆలయాల వద్ద కానరాని భద్రత ఏర్పాట్లు

తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌

కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌

అరెస్టు అన్యాయం

పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజం

తొక్కిసలాటలో మృతులకు శాంతి

చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన 1
1/1

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement