గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
పరవాడ: మండలంలో ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో సరదాగా ఈతకు దిగి గల్లంతైన విద్యార్థి భానుప్రసాద్ మృతదేహం ఆదివారం తెల్లవారుజామున తీరానికి కొట్టుకొచ్చింది. తానాం వసతి గృహంలో ఉంటూ అక్కడ జెడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు శనివారం ముత్యాలమ్మపాలెం తీరంలో ఈతకు దిగారు. కొంతసేపటికి విద్యార్థుల్లో ఒకరైన భానుప్రసాద్‌ను బలమైన కెరటాలు లోపలికి లాక్కొనిపోయాయి. తోటి విద్యార్థులు సురక్షితంగా బయటపడగా.. భానుప్రసాద్‌ను రక్షించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రావికమతం మండలం తోటకూరపాలేనికి చెందిన భానుప్రసాద్ మృతదేహం ఆదివారం ముత్యాలమ్మపాలెం తీరానికే చేరింది. మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు.


