కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
డుంబ్రిగుడ: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యోచనను కూటమి ప్రభుత్వం విరమించుకునేంత వరకు పోరాటం చేస్తామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పష్టం చేశారు. మండలంలోని పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మత్స్యలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన, కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గిరిజనులంతా కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సంతకాలను సేకరించారు. దీనిపై స్థానికులు విశేషంగా స్పందించి సంతకాలు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తమ గ్రామానికి బస్టాప్ ఉండేదని, అయితే హైవే నిర్మాణంలో భాగంగా బస్టాప్‌ను అధికారులు తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎండైనా.. వానైనా ఆరుబయటే బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పందించారు. సంబంధిత సమస్యను హైవే ఉన్నతాధికారులు, సబ్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. త్వరలో బస్టాప్ ఏర్పాటు జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో తాగునీటి సమస్యను విన్నవించారు. దీనిపై ఆయన స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, పోతంగి, కితలంగి సర్పంచ్‌లు వంతల వెంకటరావు, వి.సుబ్బారావు, గుంటసీమ ఎంపీటీసీ సభ్యుడు కూడా పాపారావు, మండల కార్యదర్శి మఠం శంకర్, నాయకులు సింహాచలం, నరసింగరావు, దశమి, రవి తదితరులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్య సేవలు దూరమవుతాయన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన వైద్య కళాశాలలను నేడు కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయంతో ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలిచిపోయేంతవరకు వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు మజ్జి సుబ్బలక్ష్మీ, నాయకులు గంగారావు, రాజారావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పెదబయలు: మండలంలోని జామిగూడ పంచాయతీలో పలు గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేసి, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే పనిలో ఉందన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ వలన పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామస్తులకు వివరించారు. అరకు అసెంబ్లీ గ్రీవెన్స్ అధ్యక్షుడు సందడి కొండబాబు, సర్పంచ్ వెంకటరావు, నాయకులు అప్పన్న, బాలన్న, దేవిప్రసాద్, బాలయ్యదొర, రామన్నపడాల్, సతీష్, రామలింగస్వామి, సతీ, రాము పాల్గొన్నారు.
ఎటపాక: మెడికల్ కాలేజీలను ప్రవేటికరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు,జడ్పీటీసీ ఉబ్బా సుస్మిత అన్నారు. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం ఎటపాక పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేశారు. అనంతరం పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు కురినాల వెంకట్, ఉప సర్పంచ్ శీలం లక్ష్మి, శీలం నాగేశ్వరరావు, రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ
తరలివచ్చిన పార్టీ శ్రేణులు
గిరిజనుల అనూహ్య స్పందన
కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి


