భక్తిశ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి
నక్కపల్లి: క్షీరాబ్దిద్వాదశిని మహిళలు ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశిని క్షీరాబ్దిద్వాదశి, చిలుక ద్వాదశిగా పిలుస్తారు. ఏకాదశి ఉపవాసం ఉన్న వారంతా మరుసటిరోజు ఆదివారం ద్వాదఽశినాడు సాయంత్రం తులసి మొక్కదగ్గర తులసి వ్రతం, లక్ష్మీకల్యాణం నిర్వహించారు. క్షీరసాగర మథనంలో జన్మించిన లక్ష్మీదేవిని మహావిష్ణువు దేవ దానవుల సమక్షంలో వివాహం చేసుకుంటాడు. మహావిష్ణువు తనకు అత్యంత ప్రీతికరమైన ద్వాదశినాడు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. సూర్యాస్తమయం అనంతరం మహిళలు తులసి కోటలో శ్రీమహావిష్ణువు ప్రతిమను ఉంచి తులసి వ్రతం ఆచరించారు. ఉసిరి దీపాలను వెలిగించారు. దీప దర్శనం వల్ల శివసాన్నిధ్యం లభిస్తుందని నమ్మకం. ఉపమాకలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో , భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాల వద్ద ప్రత్యేక పూజలు జరిపి, దీపారాధన నిర్వహించారు.


