ఉద్యోగుల ఐడీ కార్డులతో స్టీల్‌ప్లాంట్‌లోకి చొరబాటు
90 కిలోల ఇత్తడి, స్క్రాప్‌తో ఇద్దరు పట్టివేత 
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు ఉద్యోగుల గుర్తింపు కార్డులతో లోపలికి ప్రవేశించడం గమనార్హం. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అందించిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన తారకేశ్వరరావు, గోపి సాహూ అనే వ్యక్తులు ప్లాంట్‌లోని వివిధ విభాగాల నుంచి సుమారు 50 కిలోల ఇత్తడి వస్తువులు, 40 కిలోల ఇనుప స్క్రీప్టు దొంగిలించి, బీసీ గేటు సమీపంలోని టవర్–3 వద్ద బయటకు విసిరేశారు. వారు దొంగిలిస్తున్న పనిని అటుగా గస్తీ కాస్తున్న సీఐఎస్‌ఎఫ్ క్రైం బృందం గుర్తించింది. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఛేజింగ్ జరిగింది. ఎట్టకేలకు వారిని పట్టుకుని దొంగిలించిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. వారిని సోదా చేయగా.. వారి వద్ద నుంచి ఆర్‌ఎంహెచ్‌పీ, ఎస్‌ఎంఎస్–2 విభాగాలకు చెందిన ఉద్యోగుల అసలు గుర్తింపు కార్డులు బయటపడటంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరినీ స్టీల్ ప్లాంట్ క్రైం పోలీసులకు అప్పగించారు. క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
