రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
కొయ్యూరు: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మండలంలోని చిట్టింపాడులో ఏర్పాటు చేసిన దివంగత జెడ్పీటీసీ వారా నూకరాజు సంతాపసభకు విచ్చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడారు. బడి, గుడికి వెళ్లిన వారితోపాటు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలకు భద్రత కరువవుతోందని విమర్శించారు. ఇందుకు జెడ్పీటీసీ నూకరాజు హత్యే నిదర్శనమన్నారు. ఆయన కుటుంబాన్ని త్వరలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్తామన్నారు. నూకరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుదని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున రూ.ఐదు లక్షల చెక్కును అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అమర్‌నాథ్ అందజేశారు. ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ నూకరాజు తనను కూతురిలా చూసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోతున్నామన్నారు. కొయ్యూరు మండలానికి కేటాయించే నిధులు నూకరాజు పేరిట ఇస్తామని తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ చిట్టింపాడులో నూకరాజు జ్ఞాపకార్థం పార్కు నిర్మిస్తామన్నారు.దీనిపై జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ప్రజలు కోరితే అతని జ్ఞాపకార్థం కళా మందిరం ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ నూకరాజు లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధ కలిగించిందన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ నూకరాజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నూకరాజు లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్‌సీపీ నేత బొడ్డేడ ప్రసాద్, జెడ్పీటీసీ సంఘ జిల్లా నేత దొండా రాంబాబు, ఎంపీపీలు బడుగు రమేష్, అనూషదేవి, బోయిన కుమారి, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, బి.అప్పారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ జె.రాజులమ్మ, జల్లి బాబులు, సుధాకర్, అంబటి నూకాలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడుగుడివాడ అమర్‌నాథ్
కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు
సంతాప సభలో ఆవేదన
పార్టీ తరఫున కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేత
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం


