ఉచిత బస్సు ప్రయాణం ‘దూరం’
సీలేరు: జిల్లాలోని గిరిజన ప్రాంతాలను కలుపుకొని ముంపు మండలాలకు వెళ్లే మార్గంలో బస్సు సర్వీసులు లేక ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో జిల్లాల విభజన సమయంలో ముంపు మండలాలను కలుపుకొని భద్రాచలం సరిహద్దు వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాను ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం పాడేరు నుంచి సీలేరు మీదుగా భద్రాచలానికి బస్సు సర్వీసును జిల్లా అధికారులు ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి దీనిని నిలిపివేశారు. ఈ ప్రాంత ప్రజలతోపాటు విలీన మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. పథకం ప్రకటించక ముందు తిప్పిన బస్సు సర్వీసును తరువాత ఎందుకు నడపడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసుల కింద ఆల్ట్రా డీలక్స్ బస్సులు నడపడంతో వీటికి ఉచిత బస్సు ప్రయాణం వర్తించక మహిళలు రాయితీకి దూరమవుతున్నారు. విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా రోజుకు మూడు ఆల్ట్రా డీలక్స్ సర్వీసులు తిరుగుతున్నాయి. నర్సీపట్నం నుంచి సీలేరుకు రెండు, పాడేరు నుంచి డొంకరాయి ఒకటి, రాజమండ్రి నుంచి సీలేరుకు ఒక సర్వీసు తిరుగుతున్నాయి. వీటికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తోంది. కండీషన్‌లో ఉన్న బస్సులతోపాటు అదనపు బస్సు సర్వీసులు నడకపోవడం వల్ల మహిళలతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి విశాఖపట్నం, పాడేరు ప్రధాన డిపోల నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వివిధ ప్రాంతాలకు కండీషన్‌లో ఉన్న బస్సులతోపాటు ఉచిత ప్రయాణం వర్తించేలా సర్వీసులు నడపాలని సీలేరు ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి కోరారు.
సర్వీసులు లేక సౌకర్యం
కోల్పోతున్న మహిళలు


