భూ తగాదాలో వ్యక్తి హత్య
● కర్రతో దాడి.. సంఘటన స్థలంలోనే మృతి
● పరారీలో నిందితుడు
● కేసు నమోదు చేసిన పోలీసులు
జి.మాడుగుల: భూమి కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరు హత్య గురయ్యాడు. మండలంలోని గడుతూరు పంచాయతీ బొబ్బంగిపాడులో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గెమ్మెలి సత్తిబాబు(59), భార్య నీలమ్మ నివాసముంటున్న ఇంటికి ఎగువ వీధిలో పాంగి రాంప్రసాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు. సత్తిబాబు ఇంటిపక్కన ఉన్న స్థలంలో భార్య నీలమ్మ పేరుమీద ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో ఇల్లు మంజూరైంది. అయితే పశువులు కట్టుకునేందుకు ఈ స్థలాన్ని రాంప్రసాద్ చాలా కాలం నుంచి సత్తిబాబును అడుగుతున్నాడు. దీనిపై గొడవ కూడా జరుగుతోంది. స్థలం ఇచ్చేందుకు భార్యాభర్తలు అంగీకరించలేదు.ఆ స్థలంలో ప్రభుత్వం మంజూరు చేసిన పథకం ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిని సహించలేని రాంప్రసాద్ ఆదివారం సత్తిబాబు ఇంటికి వచ్చి కర్రతో దాడి చేశాడు. అడ్డుకున్న భార్య నీలమ్మపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సత్తిబాబు సంఘటన స్థలంలో మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన నీలమ్మను పాడేరు జిల్లా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించినట్టు ఆయన తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఐ,ఎస్‌ఐలు హత్యకు దారితీసిన కారణాలను తెలుసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు వారు తెలిపారు. మృతుడి కుమారుడు గెమ్మెలి సుమంత్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


