కాకిలెక్కలు
పంట నష్టం అంచనాల్లో
సాక్షి,పాడేరు: జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించి అధికారులు చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చెబుతున్న లెక్కలు వేర్వేరుగా ఉండటంతో సర్వే తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వరితోపాటు రాగులు,ఇతర చిరుధాన్యాల పంటలకు సంబంధించి గురువారం నాటికి 1501 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు కలెక్టరేట్ నుంచి ప్రకటన విడుదల అయింది. పూర్తిస్థాయి సర్వే అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. అయితే శనివారం సాయంత్రానికి పంట నష్టం లెక్కలు మారిపోయాయి. అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, పాడేరు, కొయ్యూరు, దేవీపట్నం మండలాల్లో కేవలం అన్ని పంటలు కలిపి 38.36 హెక్టార్లలో మాత్రమే నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు ‘సాక్షి’కి చెప్పడం గమనార్హం. జిల్లాలో పంట నష్టం సర్వే ఏవిధంగా జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం పెరుగుతుందని అంతా భావించిన తరుణంలో తగ్గడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
● జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.వరితో పాటు రాగులు,సామలు,కొర్రలు తదితర పంటలు ముంపునకు గురయ్యాయి.పైరు పలు చోట్ల నేలవాలింది. నష్టం గుర్తించడంలో సర్వే పారదర్శకంగా జరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
● హుకుంపేట మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మాసాడ ప్రాంతంలో ఎకరా విస్తీర్ణంలో కోసిన వరి పనలు తుపానుకు తడిచిపోయాయి. వీటిని ఆరబెట్టేందుకు శనివారం బయటకు తీయగా మొలకలు రావడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మూడు రోజుల్లో పంట నష్టం సర్వేకు అధికారులు, సిబ్బంది ఎవరూ రాలేదని వారు వాపోతున్నారు. పారదర్శకంగా సర్వేలు జరగని ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాడేరు నియోజకవర్గంలో
పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల పరిధిలో వరిపైరుకు 100 ఎకరాల్లో నష్టం వాటిల్లగా బాధిత రైతులు 200మంది వరకు ఉంటారని అంచనా. వరిపంట ముంపునకు గురవ్వడం, నేలవాలడంతో సుమారు రూ.10లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.అలాగే సుమారు 120 ఎకరాల్లో రాగులు, చిరుధాన్యాల పంటలు దెబ్బతినగా సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.
అరకులోయ టౌన్: తుపాను ప్రభావానికి అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వరి, చోడి(రాగులు) పంటలకు నష్టం వాటిల్లింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టశాతం చూడకుండా పరిహారం ఇచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 33 శాతం పైబడి నష్టం వాటిల్లిన రైతులకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో 33 శాతం లోపు పంట నష్టపోయిన వందలాది మంది గిరిరైతులు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో మాత్రమే 33 శాతం పంట నష్టం జరిగిన రైతుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తామని అరకులోయ వ్యవసాయశాఖ ఏడీ వంగవీటి మోహన్‌రావు తెలిపారు. డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు మండలాల్లో 33శాతానికి పైబడి ఎటువంటి పంట నష్టం వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు.
● నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 33శాతం లోపు నష్టపోయిన రైతులు సుమారు 500 మంది వరకు ఉన్నారు. వంద ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వరి సుమారు 65 ఎకరాలు, చోడి సుమారు 35 ఎకరాల్లో దెబ్బతింది. సుమారు రూ.15 లక్షలమేర పంట నష్టం వాటిల్లింది. అయితే 33శాతానికి మించి నష్ట పోయిన వారిలో అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో 102 మంది రైతులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. 36.07 ఎకరాల్లో రూ.4,59,347 మేర నష్టం జరిగిందని వారు తెలిపారు. వరి 25.77, చోడి 10.30 ఎకరాల్లో దెబ్బతిన్నట్టుగా వారు పేర్కొన్నారు.
దేవీపట్నం / రాజవొమ్మంగి: మోంథా తుపానుకు తీవ్రంగా పంటలు నష్టపోయామని, ప్రభుత్వం పారదర్శకంగా నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో 16 మందికి చెందిన 21.66 ఎకరాల్లో వరి పంట నష్టం కలిగిందని వారు వాపోతున్నారు. దీనిపై ఇప్పటికి అధికారులు ఓ అంచనాకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరుగురు రైతులకు చెందిన ఆరు ఎకరాల్లో పక్వానికి వచ్చిన మినుము పంట తుపాను వర్షాలకు పూర్తిగా దెబ్బతిందని వారు తెలిపారు. రాజవొమ్మంగి మండలంలో పత్తి, బర్లీ, మిరప పంటలపై ప్రభావం చూపింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పత్తిపైరు నేలవాలింది. కొండపోడులో సాగు చేస్తున్న బర్లీ పొగాకుకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అక్కడక్కడ సాగు చేపట్టిన మిరప పైరు దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు.
పంట నష్టం 38.36 హెక్టార్లు
తుపాను వర్షాలకు జిల్లాలోని ఆరు మండలాల్లో 38.36 హెక్టార్లలోనే వరితో పాటు అన్ని పంటలకు నష్టం ఏర్పడింది. పంట నష్టాలపై సమాచారం ఉన్నచోట సర్వే జరిపాం. మొదట్లో పంట నష్టం ఎక్కువగా ఉంటుందని భావించాం. వర్షాలు తగ్గిన తరువాత పంట నష్టాలపై సర్వే జరపగా తక్కువగా కనిపించింది.
– ఎస్‌బీఎస్ నందు,
జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు
చాలా చోట్ల సర్వేకు రాలేందటున్నబాధిత రైతులు
1501 హెక్టార్లలో నష్టం జరిగిందనితొలుత కలెక్టరేట్ ప్రకటన
ఇప్పుడు 38.36 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగిందంటున్నజిల్లావ్యవసాయాధికారి నందు
పొంతన లేని పంట నష్టం వివరాలు
పారదర్శకంగా చేపట్టలేదనిగిరి రైతుల ఆవేదన
మోంథా తుపానుకు జరిగిన పంట నష్టానికి సంబంధించిన అంచనాలురోజుకోరకంగా ఉంటున్నాయి. మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పంట భూములను ముంచెత్తాయి. దీంతో వరి, రాగులు, చిరుధాన్యాల పంటలు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నష్టం ఎక్కువగా జరిగినప్పటికీ అధికారులు చేపట్టిన సర్వే కాకిలెక్కలను తలపిస్తోందని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాకిలెక్కలు
కాకిలెక్కలు
కాకిలెక్కలు
కాకిలెక్కలు
కాకిలెక్కలు


