కన్నులపండువగా శ్రీనివాసుని కల్యాణం
● తిరుమల తిరుపతి దేవస్థానం
ఆధ్వర్యంలో నిర్వహణ
● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
చింతపల్లి: కలియుగ దైవం శ్రీనివాసుని కల్యాణం కన్నులపండువగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని చిట్రాలగొప్పు సమీప నూకాంబిక ఆలయ ప్రాంగణంలో శనివారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సూపరింటెండెంట్ క్రాంతికుమార్ పర్యవేక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. ఉదయం 11 గంటలకు టీటీడీ ప్రధాన అర్చకుడు శ్రీ సాయిస్వామి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరిగింది. చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, కొయ్యూరు తదితర మండలాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. గొందిపాకుల వలంటీర్ల బృందం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రోగులకు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీగా అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఇందుకు గొందిపాకల గ్రామస్తులు విరాళాలు అందించి సహకరించారు. ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి పోతురాజు బాలయ్య పడాల్, గొందిపాకల, ఎర్రబొమ్మలు సర్పంచ్‌లు సాగిన వరలక్ష్మి, లోతా పండన్న, ఎంపీటీసీలు మోహన్‌రావు, సత్తిబాబు, హిందూ ధర్మప్రచార పరిషత్, కల్యాణ ప్రాజెక్టు ఆర్గనైజర్లు హరికృష్ణ, చెంగలరావు, ప్రోగ్రాం అసిస్టెంట్లు చల్లా సత్యనారాయణ, కె.మహేశ్వరరెడ్డి, కార్యనిర్వాహకులు గెమ్మిలి అబ్బాయినాయుడు, బౌడు గంగరాజు, కుశలవుడు,సింహాచలం, యశ్వంత్, వెంకటేష్, రామ్మూర్తి పాల్గొన్నారు.
కన్నులపండువగా శ్రీనివాసుని కల్యాణం


