పాఠశాల గేటుకు తాళం
చింతూరు: స్వీపరు పోస్టు కోసం జరిగిన వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పాఠశాల గేటుకు తాళం వేసిన ఘటన మండలంలోని పెదశీతనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడకం సుబ్బారావు తాత బుచ్చయ్య గతంలో పాఠశాలకు స్థలాన్ని దానం చేశాడు. ఈ స్థలాన్ని దానం చేసిన తమ కుటుంబానికి కాకుండా వేరే మహిళకు స్వీపర్ పోస్టు ఇవ్వడంపై సుబ్బారావు అభ్యంతరం వ్యక్తంచేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగ్రహించిన అతను శనివారం పాఠశాల గేటుకు తాళం వేశాడు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులను సమీపంలోని రచ్చబండపై కూర్చోబెట్టారు. సుమారు గంటన్నర అనంతరం ఎస్‌ఐ రమేష్ గ్రామానికి చేరుకుని గేటు తాళాలు తీయించి విద్యార్థులను పాఠశాలలోకి పంపారు. అనంతరం ఆయన సుబ్బరావుతో పాటు ప్రస్తుతం స్వీపర్‌గా పనిచేస్తున్న శైలజ అనే మహిళకు చెందిన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎస్‌ఎంసీ తీర్మాన ప్రకారం నాలుగేళ్ల నుంచి శైలజ స్వీపర్‌గా చేస్తోందని ఇప్పుడు ఎలా తొలగిస్తారంటూ ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. దీనిపై ఇరు వర్గాలతో చర్చించిన ఎస్‌ఐ మాట్లాడుతూ ఘర్షణ పడకుండా పాఠశాల నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఎంఈవో–2 గుండి వెంకటేశ్వర్లు కూడా పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఉపాధ్యాయులు, గ్రామస్తులనుంచి వివరాలు తెలుసుకున్నారు.
రచ్చకెక్కిన స్వీపర్ పోస్టు వివాదం
తెరిపించిన ఎస్‌ఐ రమేష్
నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఇరువర్గాలకు సూచన
పాఠశాల గేటుకు తాళం


