కాటుక బంతి కన్నీరు
సాక్షి,పాడేరు: మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సీతమ్మ కాటుక రకం బంతి సాగు చేపట్టిన రైతులకు మోంథా తుపాను నష్టం మిగిల్చింది. పూత సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడురోజులపాటు కురిసిన వర్షాలకు బంతితోటలు నేలవాలగా పూలు కుళ్లిపోయాయి. మొగ్గలు వాడిపోయాయి. పంట చేతికందే సమయంలో మోంథా తుపాను తీరని నష్టం మిగిల్చిందని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు.
● పాడేరు మండలంలో డి.గొందూరు, బరిసింగి, డోకులూరు, ఇరడాపల్లి, గుత్తులపుట్టు, గబ్బంగి, చింతలవీధి, జి.ముంచంగిపుట్టు, వంజంగి, వనుగుపల్లి, హుకుంపేట మండలంలోని సూకురు, మట్టుజోరు, గూడ, హుకుంపేట, తాడిపుట్టు, మఠం, తడిగిరి, శోభకోట, పెదబయలు మండలంలో పెదకోడాపల్లి, గంపరాయి, జి.మాడుగుల మండలంలో కోడాపల్లి పంచాయతీల పరిధిలోని ప్రాంతాల్లో 200 ఎకరాల్లో సాగు చేపట్టారు.
● మోంథీ తుపాను వర్షాలకు సుమారు 100 ఎకరాల్లో బంతి తోటలకు నష్టం వాటిల్లింది. మెట్ట, కొండపోడు భూముల్లో సాగు చేపట్టిన ఈ తోటల ద్వారా ఎకరాకు రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది.ఇప్పుడిప్పడే పూత ప్రారంభమైంది.ఈ సమయంలో వర్షాలకు తోటలకు పూర్తిగా నష్టం ఏర్పడింది. ఈ ఏడాది పూత ఆశాజనకంగా ఉంది. మార్కెట్లో పరిస్థితులు కలిసివస్తే ఆదాయం కూడా బాగుంటుందని గిరి రైతులు ఆశించారు. ప్రకృతి తుపాను రూపంలో వారిని కోలుకోలేని దెబ్బతీసింది.
● ఏజెన్సీలో బంతిపూలకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు బుట్ట పూలను రూ.100 నుంచి రూ.200 ధర మధ్య కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తారు. రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. వచ్చే జనవరి నెల వరకు మన్యంలో బంతిపూల అమ్మకాలు భారీగా జరిగేవి. ఈ ఏడాది నెలకొన్న పరిస్థితి అమ్మకాలను బట్టి ఏజెన్సీలో సంతల్లో బంతిపూల అమ్మకాలు లేనట్టేనని వ్యాపారులు అంటున్నారు.
గిరి రైతులను నష్ట పరిచిన
మోంథా తుపాను
వర్షాలకు నేలవాలిన తోటలు
కుళ్లిపోయిన పూలు
వాడిపోయిన మొగ్గలు
పెట్టుబడులు దక్కని పరిస్థితి
పంట చేతికందే సమయంలో కోలుకోలేని దెబ్బ
కోలుకోలేని దెబ్బ
తుపాను వర్షాలు బంతిపంటను నాశనం చేశాయి. ఎకరా విస్తీర్ణంలో వేసిన కాటుక రకం బంతి తోట పూర్తి పాడైంది. వేళ్లు నానిపోవడంతో వాడిపోతున్నాయి. తోటంతా నేలవాలింది. రూ.20వేల ఆదాయం రావాల్సిన బంతి తోట ఎందుకు పనికిరాకుండా పోయింది.
– గొరపల్లి ప్రసాద్, బంతి రైతు,
బరిసింగి, పాడేరు మండలం
కాటుక బంతి కన్నీరు
కాటుక బంతి కన్నీరు


