‘హైడ్రోపవర్’ పోరాటంపై కలెక్టర్ వ్యాఖ్యలు సరికాదు
చింతపల్లి: హైడ్రోపవర్ ప్రాజెక్ట్, పంప్డ్ స్టోరేజ్ బాధిత గిరిజనుల తరఫున పోరాటం చేస్తున్న నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని వ్యాఖ్యలను కలెక్టర్ దినేష్ కుమార్ వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఎర్రవరం హైడ్రోపవర్ బాధిత గిరిజన సంఘ కన్వీనర్ బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎర్నాపల్లిలో హైడ్రోపవర్ ప్రాజెక్టు బాధిత గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలో హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిపుణుల కమిటీతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో హైడ్రోపవర్ ప్రాజెక్టుల పేరుతో పోరాటాలు చేయడాన్ని కలెక్టర్ తప్పుపట్టారన్నారు. పోరాటాల్లో పాల్గొన్న నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని ఎస్పీ సమక్షంలో ఆయన హెచ్చరించడం సరికాదన్నారు. గిరిజన ప్రాంతంలో భూబదలాయింపు చట్టాలు ఉన్నప్పటికీ భూభాగాన్ని ఖనిజాలు, ప్రాజెక్టుల పేరుతో కళ్లముందే ఆదివాసీలు కోల్పోతున్నప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.ఆదివాసీ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని అదాని, నవయుగ, షిరిడిసాయి వంటి ప్రైవేట్ సంస్థలకు జీవోలు ఇచ్చి రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నారని మండి పడ్డారు. ప్రాజెక్టుల్లో గిరిజనులకు ఉపాధి కల్పిస్తామని కలక్టర్ ప్రకటించారని, గిరిజన ప్రాంతంలో తమ ఉద్యోగాలే తమకు లేవని.. అలాంటిది ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అనంతగిరి, అరకు, హుకుంపేట, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు గిరిజన చట్టాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయని ధ్వజమెత్తారు. గిరిజన చట్టాలను కాపాడాల్సిన కలక్టర్ పోరాటాలు చేస్తున్న గిరిజన నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకూ సమంజస మన్నారు. ప్రాజెక్టులు పేరుతో ఆదివాసీలను గిరిజన భూబాగం నుండి గెంటివేసే కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా గిరిజనులంతా ఒకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎర్రబొమ్మలు సర్పంచ్ లోతా పండయ్య, ఉప సర్పంచ్ సెగ్గే సోమరాజు, గిరిజన సంఘం జిల్లా ఉపాద్యక్షులు పాంగి దనుంజయ్, కోకన్వీనర్ వెంకటేశ్వర్లు ,తాంబేలు బాబూరావు, పాంగి కామరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా గౌరవఅధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్


