పాడేరు ఐటీడీఏకు ఆది కర్మయోగి పురస్కారం
పాడేరు : ఆదికర్మయోగి అభియాన్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులు, కెరియర్ ప్లాన్ నిర్మించేలా తయారుచేసిన విలేజ్ యాక్షన్ ప్లాన్‌కు గుర్తింపు లభించిందని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పాడే రు ఐటీడీఏకు ఆది కర్మయోగి పురస్కారం అందజేసినట్టు ఆమె పేర్కొ న్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఐటీడీఏలోని తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా రాబోయే ఐదేళ్లలో గిరిజన ప్రాంతాలను సమూలంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. బిర్సాముండా జయంతి పురస్కరించుకుని జన జాతీయ గౌరవ దివస్ మహోత్సవాలను శనివారం నుంచి ఈనెల 15 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా శనివారం ఉదయం ఐటీడీఏ నుంచి స్థానిక కాఫీ హౌస్ వరకు కార్నివాల్ నిర్వహిస్తామన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా వివిధ ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కాఫీ హౌస్‌లో మొక్కలు నాటుతామన్నారు. బిర్సా ముండా, గిరిజన స్వతంత్య్ర సమరయోధుల చిత్రపటాలలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామన్నారు. ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి గిరిజన సంస్కృతి, కళలు, వేషధారణ తదితర అంశాలపై డాక్యుమెంటరీ చేస్తామన్నారు. వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న గిరిజనులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆమె పిలపునిచ్చారు.
విలేజ్ యాక్షన్ ప్లాన్‌కు
కేంద్ర ప్రభుత్వ గుర్తింపు
నేటి నుంచి 15 వరకు జన జాతీయ గౌరవ దివస్ మహోత్సవాలు
పీవో తిరుమణి శ్రీపూజ


