రాత్రి వేళల్లో డ్రోన్ల సంచారంపై ఫిర్యాదు
● ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా
ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్
● బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్
అరకులోయ టౌన్: జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించే పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో డ్రోన్లు ఎగురుతుండటంపై పాడేరు డీఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ తెలిపారు. శుక్రవారం ఆయన గిరిజన సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాత్రివేళ డ్రోన్లు ఎగురుతుండటంపై పరిసర గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారన్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం అరకులోయ మండలంలోని తోరడంవలస, లండిగుడ, అనంతగిరి మండలం వేంగడ, మెట్టుపాడు, గాఫ్యవలస, గోమంగి పాడు, దాళిమ్మపుట్టు, కొత్తవలస, వాలసీ, హుకుంపేట మండలం మజ్జివలస, కుసుమవలస, పట్టాం పరిసరాల్లో బుధవారం, గురువారం రాత్రి వేళల్లో డ్రోన్లు ఎగరడాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారన్నారు. నవయుగ కంపెనీకి చెందిన వ్యక్తులే ఇందుకు కారణం కావచ్చని అనుమానిస్తున్నామన్నారు. సర్వేలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అనుమానితులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎస్పీ ప్రకటించారని, ఇప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంఘ మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, రాము, కిల్లో బుజ్జిబాబు, వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బురిడి దశరథ్, జిల్లా కో కన్వీనర్లు జగన్నాథం, మగ్గన్న పాల్గొన్నారు.


