పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
అనంతగిరి (అరకులోయ టౌన్): మోంథా తుపాను వర్షాలకు మండలంలోని రహదారులు శిథిలాస్థకు చేరాయి. అనంతగిరి –ఎస్.కోట ఘాట్ రోడ్డులో ఒకటో నంబర్ ఎయిర్ పిన్ బెండ్ వద్ద రక్షణగోడ కూలిపోయింది.అరకు సీఐ హిమగిరి, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, గోపాలరావులు జేసీబీని రప్పించి పరిస్థితిని మెరుగుపరిచారు. తాడిగుడ జలపాతం సమీపంలోని కాజ్‌వే, వేంగడ డొంకాపూట్ కాజ్‌వేలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గంగవరం/దేవీపట్నం: తుపాను నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నెల్లిపూడి బురద కాలువ, పెద్దకాలువల్లో ఉధృతి నెలకొంది. తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెంకటేష్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నెల్లిపూడి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గోకవరం–అడ్డతీగల ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల్లిపూడి వాగు వద్ద బ్రిడ్జిపై నుంచి మూడు అడుగుల ఎత్తులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు సాగించకుండా పోలీసులు,రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, నెల్లిపూడి వద్ద పరిస్థితిని సమీక్షించారు. సూరంపాలెం రిజర్వాయరుకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట– గోకవరం మార్గంలో ఫజుల్లాబాద్ సమీపంలో కాజ్‌వేపై వరద నీరు ఉధృతిగా ప్రవహించింది. సాయంత్రం నాలుగు గంటలకు కూడా ప్రవాహం తగ్గలేదు. దీంతో గోకవరం నుంచి ఇందుకూరుపేట వెళ్లే ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈనుకొండ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇందుకూరుపేట–ఎం.రావిలంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
కాజ్‌వేల ధ్వంసంతో అవస్థలు
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు


