సచివాలయ ఉద్యోగుల విశేష సేవలు
వరి, చోడి తదితర పంటలకు భారీ నష్టం
దెబ్బతిన్న 278 ఇళ్లు, చాలా చోట్ల రోడ్లు ధ్వంసం
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ‘తుపాను’ పరిణామాలు
టెలీకాన్ఫరెన్స్‌లో వివరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
పాడేరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మోంథా తుపానులో విశేష సేవలు అందించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. తుపాను నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై గురువారం పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశానికి స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ఆయన హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 770 హెక్టార్లలో వరి, వంద ఎకరాల్లో చోడి, 300 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే వివరించారు. జిల్లాలో సుమారు 278 ఇళ్లలో కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా ధ్వంసం అయినట్టు పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. చాలా చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, కొండచరియలు విరిగిపడి జనజీవనానికి ఇబ్బందులు ఎదురైనట్టు ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు బాధితులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని పార్టీ అధినేత సూచించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమం మరింత ఉదృతం చేయాలని, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరం చేయాలని సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు.


