ఘాట్‌రోడ్డు పునరుద్ధరణ పనుల పరిశీలన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సూచన
సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్‌లో కొండచరియలు జారిపడి ధ్వంసమైన రోడ్డు ప్రాంతాన్ని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనను తెలుసుకున్న ఆయన గురువారం ఉదయం అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బండరాళ్లు తొలగింపు, రోడ్డు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడిన ప్రమాద సంఘటన దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లే వాహన చోదకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఘాట్‌లో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అటవీ, ఆర్‌అండ్‌బీ పోలీసుశాఖలను ఎమ్మెల్యే కోరారు.


