గంజాయి రవాణా నియంత్రణకు శాశ్వత చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: జిల్లాలో గంజాయి రవాణాను శాశ్వతంగా అరికట్టడానికి పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పోలీస్, వ్యవసాయ శాఖ, ఉద్యాన, అటవీ, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, ట్రైబల్ వెల్ఫేర్, ఎకై ్సజ్, బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సమావేశంలో తీసుకున్న కార్యచరణ అమలుపై ఆరా తీశారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయి రవాణా అవుతున్న వివరాలను తెలుసుకున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమీక్ష సమావేశానికి పూర్తి సమాచారంతో అధికారులు రావాలన్నారు. గంజాయికి ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్న పంటల వివరాలు తెలుసుకున్నారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై పాఠశాల, కళాశాలల్లో వారానికి ఒకటి రెండు క్లాసులు తీసుకోవాలన్నారు. ఆదివాసీ సేవా కేంద్రాల సిబ్బందికి గంజాయి సాగు, రవాణా గుర్తించేలా శిక్షణ ఇప్పించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ గంజాయి రవాణా, సాగు చేసిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల స్థిరాస్తులు, ఆస్తులను జప్తు చేస్తామన్నారు. గంజాయి స్మగ్లర్లకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతు నాయుడు, డీఈవో బ్రహ్మాజీరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా ఉద్యాన అధికారి కర్ణ తదితరులు పాల్గొన్నారు.


