క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
విశాఖ సిటీ : క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీగా లాభాలు వస్తాయని చెప్పి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవలే వరుసగా రెండు కేసుల్లో ఆరుగురు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎక్స్చేంజ్ 666, బ్లాక్ డైమండ్ 9.కామ్ అనే అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఆ వెబ్‌సైట్ డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశచూపిస్తూ బెట్టింగ్ రొంపిలోకి దించుతున్నట్లు గుర్తించారు. బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు వారి సొంత ఐడీలు ఇస్తూ దాని ద్వారా అనేక మందిని బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన పెయ్యిల త్రినాథ్ (23), కాశీరెడ్డి బాలసంజీవరావు(39)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఏడు రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు.
క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్


