వంతెన నిర్మించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
తుపాను సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం, అధికారులు విఫలం
నిత్యావసర వస్తువులు అందక గిరిజనుల అవస్థలు
అడవితల్లి బాట పేరిట రూ.2కోట్లతో నాణ్యతలేని రోడ్డు నిర్మాణం
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆవేదన
డుంబ్రిగుడ: చాపరాయి గెడ్డపై వంతెన నిర్మించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని చాపరాయి గెడ్డ ఉధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను వర్షాలు కారణంగా మూడు రోజులుగా పోతంగి పంచాయతీ పెద్దపాడు, కోసంగి, చంపపాట్టి, ఊయాలగుడ, శీలంగొంది, జాకరవలస గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. నిత్యావసర వస్తువులు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెద్దపాడుకు గెడ్డ అవతల నుంచి సుమారు రూ.2 కోట్లతో అడవితల్లి బాట పేరుతో తూతు మంత్రంగా నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించారన్నారు. రోడ్డు నిర్మిస్తే సరిపోదని, వంతెన కూడా నిర్మించాలని సూచించారు. ఈ రోడ్డుకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గెడ్డను దాటి వెళ్లినప్పుడు వంతెన గురించి ఆలోచిస్తే బాగుండేదన్నారు. తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంపాపట్టి వద్ద కాజ్‌వేను పరిశీలించారు. ఈ గ్రామంలో పాఠశాల భవనం దెబ్బతినడంపై గెడ్డ అవతల ఉన్న గిరిజనులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంఈవోలు సుందరరావు, గెన్నును ఫోన్‌లో ఆదేశించారు. పంట, గృహ నష్టాలపై ప్రభుత్వానికి నివేదించి బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ త్రివేణిని ఫోన్‌లో ఆదేశించారు. చాపరాయి, చంపాపట్టి వద్ద వంతెనలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అరకు, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు రామూర్తి, పి పరశురామ్, నియోజకవర్గం యువ నాయకుడు రేగం చాణక్య, ఉమ్మడి జిల్లాల ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, సర్పంచ్, ఉప సర్పంచ్‌లు వంతల వెంకటరావు, శెట్టి జగ్గునాయుడు, ఎంపీటీసీ రామారావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు కె.దశమి పాల్గొన్నారు.


