ఆశ్రమ పాఠశాల సందర్శన
రంపచోడవరం: మండలంలోని ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలను సర్పంచ్ కోసు రమేష్‌బాబుదొర, ఎంపీటీసీ వంశీ కుంజం గురువారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, లేదా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబరు సత్యనారాయణ, బొబ్బా శేఖర్, వేల్ఫేర్ అసిస్టెంట్ బాపన్నమ్మ, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.
అల్లం తోడుతో లారీ బోల్తా
తగరపువలస : డ్రైవర్ నిద్రమత్తు కారణంగా గురువారం ఉదయం ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ నీళ్లకుండీల వద్ద జాతీయ రహదారి మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి లారీ బోల్తా పడింది. బెంగుళూరు నుంచి అల్లం లోడుతో కోల్‌కత్తా వెళ్తున్న లారీ జాతీయ రహదారిలో రెయిలింగ్‌ను దూసుకుని సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయట పడ్డారు.
5న పుణ్యనదీ హారతి
సింహాచలం: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వచ్చే నెల 5న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండ దిగువ వరాహ పుష్కరిణి(కోనేరు)కి పుణ్యనదీ హారతి నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జ్ ఈవో ఎన్.సుజాత గురువారం తెలిపారు. ఆరోజు కొండదిగువ ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను తిరువీధిగా కోనేరు వద్దకు తీసుకెళ్లి, అక్కడ ద్వయ హారతి, నక్షత్ర హారతి, కుంభ హారతి కార్యక్రమాలు జరుపుతామన్నారు. భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరారు. అలాగే కోనేరు గట్టుపై దీపారాధన కార్యక్రమంలో పాల్గొని, తరించాల్సిందిగా పిలుపునిచ్చారు.


