తాండవకు పెరుగుతున్న వరద నీరు
నాతవరం: తాండవ రిజర్వాయరులోకి ఇన్‌ఫ్లో నీరు పెరగడంతో రాత్రికి ఏ సమయంలోనైనా స్పిల్ వే గేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదలను పెంచే అవకాశం ఉందని ప్రాజెక్ట్ డీఈ ఆనురాధ అన్నారు. ఆమె గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ మోంథా తుఫాన్ ప్రారంభం నుంచి తాండవ రిజర్వాయర్ ప్రమాద స్థాయి నీటి మట్టాన్ని నివారించేందుకు నాలుగు రోజులుగా స్పిల్ వే గేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్థాయిని బట్టి 350 క్యూసెక్కులు, తర్వాత రోజు 2400 క్యూసెక్కులు, రెండు రోజులుగా 1230 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 377.4 అడుగులు దాటలేదన్నారు. గురువారం ఉదయం నుంచి ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 2900 క్యూసెక్కులు అధికంగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. దీంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 378 అడుగులకు పెరిగిందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఇన్ ఫ్లో నీటిని బట్టి ప్రాజెక్టు ప్రమాదం దృష్టిలో పెట్టుకుని స్పిల్‌వే గేట్ల ద్వారా నదిలోకి మరింత నీటిని రాత్రికి విడుదల చేసే అవకాశముందన్నారు. తాండవ ప్రాజెక్ట్ ప్రమాద స్థాయి నీటి మట్టం 380 అడుగులు అన్నారు. తాండవ నదిలోకి రాత్రి వేళల్లో దిగరాదని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలకు దండోరా ద్వారా తెలియజేశామన్నారు.
తగ్గుముఖం పట్టిన పెద్దేరు నీటిమట్టం
మాడుగుల : మండలంలో పెద్దేరు జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 800 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 135 మీటర్లకు తగ్గిందని జలాశయం జేఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు.


