నేటి నుంచి రేడియోలజిస్టుల సదస్సు
హాజరుకానున్న 600 మంది రేడియాలజిస్టులు
మహారాణిపేట : రాష్ట్ర రేడియోలజిస్టుల వార్షిక సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నగరంలో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ రేడియోలజీకల్ ఇమేజింగ్ అసోసియేషన్(ఏపీఐఆర్‌ఐఏ) రాష్ట్ర అధ్యక్షుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి.సురేష్ తెలిపారు. గురువారం జగదాంబ జంక్షన్‌లో ఉన్న డాల్ఫిన్ డయాగ్నిస్టిక్ సెంటర్‌లో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 600 మంది రేడియాలజిస్టులు, వైద్య అధ్యాపకులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. తొలిరోజు గీతం మెడికల్ కాలేజీలో ఫీటల్ రేడియాలజీపై ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహించనున్నామన్నారు. రెండో, మూడో రోజుల్లో వైద్య ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, శాసీ్త్రయ పత్రాల ప్రదర్శనలు జరగనున్నాయన్నారు. ఈ సారి రికార్డు స్థాయిలో 160 రేడియోలజీ పరిశోధనా పత్రాలు సమర్పిస్తున్నామన్నారు. సదస్సులో రాష్ట్ర స్థాయి రేడియాలజీ క్విజ్ నిర్వహించనున్నామన్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీకి చెందిన ఆచార్య డాక్టర్ రాజు శర్మ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన కాకర్ల సుబ్బారావు ఉపన్యాసం ఇవ్వనున్నారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఉమా మహేశ్వరరెడ్డి, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ వర్మ, డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు.


