వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
సీలేరు: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గూడెం కొత్తవీధి వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ పాంగి దుర్జొ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, ఎంపీపీ బోయిన కుమారి తదితరులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పాలన, కుట్ర రాజకీయాలను వివరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థులు కూడా వైద్య విద్య అభ్యసించాలని, సర్కారు వైద్య సేవలు మరింతగా అందరికీ అందేలా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి, బడా కంపెనీలకు వాటి నిర్వహణ అప్పగించేందుకు చూస్తోందన్నారు. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య, సామాన్యులకు ప్రభుత్వ వైద్యం అందే పరిస్థితి ఉండదన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం సీలేరు పంచాయతీ వైఎస్సార్‌సీపీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా పేలూరి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా గణేష్, నూకరాజు, బాబులాల్. వెంకట్రావు. కార్యదర్శులుగా కిముడు విశ్వనాథ్, వంతల మారి బాబు, శ్రీకాకుళపు నూకరాజు, కొర్ర రాజేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా విభాగ సీలేరు పంచాయతీ అధ్యక్షురాలుగా కంకిపాటి రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శులుగా కిల్లో నాగమణి, వంతల ధోన, కార్యదర్శులు వంతల రజిని, కుప్ప కుమారిలను ఎన్నుకున్నారు. ఎంపీటీసీ సభ్యులు సాంబమూర్తి. మొట్టడం సత్యనారాయణ , పాడేరు ఎస్సీ సెల్ అధ్యక్షురాలు స్వర్ణ లత, మండల ప్రధాన కార్యదర్శులు వంతల చంటి బాబు,కొర్ర బలరాం తదితరులు పాల్గొన్నారు.


