వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం
ముంచంగిపుట్టు: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కొనుక్కునే పరిస్థితి దాపరిస్తుందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ సరియాపుట్టులో బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని విరమించాలని స్థానికులు నినాదాలు చేశారు. అనంతరం గడప గడపకు వెళ్లి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న కేంద్రంతో పోరాడి 17 వైద్య కళాశాలలు తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. జగనన్నకు మంచి పేరు వస్తుందని భయంతో పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకు తెగబడుతుందని, మెరుగైన వైద్యం పేదవాడికి అందించాలని జగనన్న ముందుకు వస్తే దానిని నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు. ఎంపీపీ సీతమ్మ, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, వైస్‌ఎంపీపీ భాగ్యవతి, సర్పంచులు నరసింగరావు, గంగాధర్, సుభాష్, నొబినా, వసంత, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల,నోబ్బో, గణపతి, వైఎస్సార్‌సీపీ మండల నేతలు పాల్గొన్నారు.
వైద్యం కొనుక్కోవాల్సిన దుస్థితి
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్
జల్లిపల్లి సుభద్ర ఆవేదన
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా
సరియాపుట్టులో కోటి సంతకాల సేకరణ
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం


