జిల్లా ఆస్పత్రిలోవైద్యసేవలపై ఆరా
పాడేరు : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను సకాలంలో స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత ఆదేశించారు. స్థానిక జిల్లా ఆస్పత్రిని బుధవారం ఆమె సందర్శించారు. వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రసూతి వార్డులో గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. రోగులకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. నాణ్యమైన ఆహారం వడ్డించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆస్పత్రిలో నీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. రోగుల పట్ల మర్యాదగా మెలగాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట జిల్లా ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి. వెంకట్, ప్రసూతి విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సృజన పాల్గొన్నారు.


