
సరిహద్దు వంతెనకు నిర్లక్ష్య గ్రహణం
ముంచంగిపుట్టు: ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ సరిహద్దులోనిర్మించే జోలాపుట్టు వంతెనకు నిర్లక్ష్య గ్రహణం పట్టింది.దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. 10 సంవత్సరాలుగా వంతెన పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు పూర్తి చేయాలని పలుమార్లు సరిహద్దు గ్రామాల గిరిజనులు అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లినా హామీలతో సరి పెట్టారు.చివరికి వంతెన నిర్మాణ వ్యయం పెరగడంతోకాంట్రాక్టర్ పనులు నిలుపుదల చేశారు. 2014 సంవత్సరంలోఅప్పటి కాంగ్రెస్ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి,శిలాఫలకం ఆవిష్కరించారు. రూ. 5 కోట్ల ఎంపీ నిధులతో వంతెన నిర్మాణం ప్రారంభించారు.దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. కానీ అప్పటి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వంతెన పనులు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. వంతెన నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రచారం జరుగుతోందని,కానీ ఈ విషయమై ఒడిశా ప్రభుత్వం ఎక్కడా ప్రకటనలు చేయలేదు.
తాత్కాలిక వంతెనపై రాకపోకలు
2006 సంవత్సరంలో వరద నీటి ఉధృతికి సరిహద్దును కలుపుతూ ఉన్న ఐరెన్ వంతెన కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి ఇరు రాష్ట్రాలకు రవాణా కష్టాలు మొదలయ్యాయి. జోలాపుట్టులో గల జలాశయాలపై ఉన్న వంతెనలపై రాకపోకలు చేసేవారు. అయితే ఈ మార్గంలో రాకపోకల వల్ల జలాశయానికి గండి పడే ప్రమాదం ఉంది. దీంతో భారీ వాహనాల రాకపోకలనుజలాశయ అధికారులు నిలుపుదల చేశారు. ద్విచక్రవాహనాలు, పాదచారుల కోసం ఆ పక్కనే జలాశయ అధికారులు తాత్కాలిక ఐరెన్ వంతెనను ఏర్పాటు చేశారు. దీనిపై నుంచి విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే జలాశయం నుంచి నీరు విడుదల చేసినప్పుడు, వర్షాలు కురిసే సమయంలో ఈ వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాలు మూడు కిలో మీటర్లు ప్రయాణం చేసి,జలాశయంపై నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొంది.సరిహద్దు ప్రజల రవాణా కష్టాలను తీర్చేవిధంగా చొరవ తీసుకోవాలని,వెంటనే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సరిహద్దు వంతెనపై దృష్టి పెట్టి నిధులు మంజూరు చేసి తమ కష్టాలు తీర్చాలని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గిరిజనులు కోరుతున్నారు.
పునాది స్థాయిలో
నిలిచిపోయిన వంతెన
నిధులు మంజూరు చేయాలి
వంతెన పూర్తయితే ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలు ఇబ్బందులు తొలగుతాయని అనుకొన్నాం. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాం. ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి,నిధులు మంజూరు చేసి రవాణా కష్టాలు తీర్చాలి.
– శేఖర్, జోలాపుట్టు గ్రామస్తుడు. ముంచంగిపుట్టు మండలం
ఉన్నతాధికారుల
దృష్టికి తీసుకెళ్లాం
జోలాపుట్టు వంతెన నిధులు ఎప్పుడో వెనక్కి వెళ్లిపోయాయి. టెండర్ కూడా రద్దయింది. స్థానికులు పలుమార్లు వంతెన సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. మేం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కోసం వేచి చూస్తున్నాం.
– రాయుడు, ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ, ముంచంగిపుట్టు మండలం
10 ఏళ్లగా రాకపోకలకు
ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల ప్రజల అవస్థలు
నిధులు వెనక్కి వెళ్లిపోవడంతో
నిలిచిన పనులు
ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్న సరిహద్దు ప్రజలు

సరిహద్దు వంతెనకు నిర్లక్ష్య గ్రహణం

సరిహద్దు వంతెనకు నిర్లక్ష్య గ్రహణం