బంతి...ధరల కాంతి | - | Sakshi
Sakshi News home page

బంతి...ధరల కాంతి

Oct 19 2025 6:39 AM | Updated on Oct 19 2025 6:39 AM

బంతి.

బంతి...ధరల కాంతి

దీపావళి సందర్భంగా పెరిగిన ధర

బుట్టడు పూలు రూ.150

కొనుగోలుకు పోటీపడిన వర్తకులు

గిరి రైతుల ఆనందం

సాక్షి, పాడేరు: జిల్లాలో బంతి పూలకు భలే డిమాండ్‌ ఏర్పడింది. దీపావళి పండగ నేపథ్యంలో మన్యంలోని బంతిపూలకు గిరాకీ ఏర్పడింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఈఏడాది తొలిసారిగా ఒడిశాలోపలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా పూలను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. పాడేరు పాతబస్టాండ్‌లో శనివారంమార్కెట్‌కు గిరిజనులు భారీగాబంతిపూలను తీసుకువచ్చారు. బుట్టడు బంతి పూలను రూ.150లకు వర్తకులు కొనుగోలు చేశారు. హుకుంపేట, పాడేరు, పెదబయలు, జి.మాడుగుల మండలాల పరిధిలోని పలు గ్రామాల గిరిజనులు ఉదయం నుంచే పూల అమ్మకాలను చేపట్టారు. మధ్యాహ్నం వరకు సీతమ్మకాటుక (చిన్నబంతి) రకం పూల వ్యాపారం పోటాపోటీగా జరిగింది. ముద్దబంతి పూలను బుట్ట రూ.100లకువ్యాపారులు కొనుగోలు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ పూలను కొనుగోలు చేసి విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్‌ ప్రాంతాలకు తరలించారు. ఒడిశా వ్యాపారులు తమ రాష్ట్రానికి వ్యాన్ల ద్వారా పూలను రవాణా చేశారు.

పండగవేళ ఆదాయం

దీపావళి పండగ సందర్భంగా బంతిపూల అమ్మకాలు పెరగడంతో గిరిజన రైతులకు మంచి ఆదాయం లభించింది. శుక్రవారం నుంచి బంతిపూల ధరలు పెరగడంతో బుట్ట పూలకు రూ.150 వరకూ ధర లభించింది.ప్రతి గిరిజన రైతు పాడేరు మార్కెట్‌లో రోజుకు ఐదు నుంచి పది బుట్టల వరకు బంతిపూలను విక్రయిస్తున్నారు.కార్తీకమాసం ప్రారంభం కానుండడంతో బంతిపూల ధర మరింత పెరగనుంది.ఒడిశా పూల వ్యాపారులు నేరుగా వాహనాలతో పాడేరు మార్కెట్‌కు వచ్చి బుట్ట పూలను రూ.150 ధరతో కొనుగోలు చేస్తుండడంతో పోటీ ఏర్పడింది. స్థానిక వ్యాపారులు కూడా అదే ధరతో కొనుగోలు చేస్తుండడంతో గిరిజన రైతులకు కలిసి వచ్చింది. గిరిజన రైతులు పూలసేకరణ,అమ్మకాలతో బిజీగా ఉన్నారు.

ధర పెరిగింది

బంతి పూలకు గిరాకీ ఏర్పడింది. గత వారం బుట్ట ధర రూ.30 నుంచి రూ. 50 వరకు ఉంటే ఈవారం రూ.150 నుంచి రూ.200 పైబడి ఉంది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు.

–బి.చిట్టిబాబు, డి.చింతలవీధి,

హుకుంపేట మండలం

గిట్టుబాటు ధర లభించింది

వారం బంతి పూలకు మంచి ధర లభించింది. ఈవారం నుంచి అయ్యప్ప స్వాముల సంఖ్య పెరగడంతో పూలకు గిరాకీ ఏర్పడింది. దీంతో మాకు గిట్టుబాటు ధర లభిస్తోంది.

–కిముడు శాంతికుమారి, రైతు,కుమరిపుట్టు, పాడేరు మండలం.

బంతి...ధరల కాంతి 1
1/2

బంతి...ధరల కాంతి

బంతి...ధరల కాంతి 2
2/2

బంతి...ధరల కాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement