
సచివాలయాల ఉద్యోగులు సకాలంలో సేవలు అందించాలి
రంపచోడవరం: సచివాలయాల్లో ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో సేవలు అందించాలని, రికార్డులు పక్కాగా నిర్వహించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు. రంపచోడవరం మండలం ముసురుమిల్లి గ్రామంలో గురువారం సచివాలయాన్ని, సబ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని ఉద్యోగులతో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆటపాటలతో విద్యపై మక్కువ ఉండే విధంగా బోధించాలన్నారు. నిబంధనల ప్రకారం చిన్నారులకు, గర్భిణులకు ఆహార పదార్థాలను అందించాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్‌కు వచ్చే విద్యార్థులకు కంటి పరీక్షలు, విటమిన్ పరీక్షలు పీవో పరిశీలించారు. అనంతరం రంపచోడవరంలోని జీసీసీ గొడౌన్‌ను పీవో పరిశీలించారు. ప్రతి నెలా ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం వస్తున్నాయి, నిత్యావసరాలు ఎన్ని వస్తున్నాయి.. వంటి వివరాలు తెలుసుకున్నారు. గొడౌన్‌లో ఉన్న స్టాక్ గురించి ఆరా తీశారు. స్థానిక ఎంపీపీ పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న బోజన పథకం సక్రమంగా అమలు చేయాలన్నారు. పందిరిమామిడి సెంటర్‌లోని జీడిపిక్కల ప్రొసెసింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ ఏడాది ఎన్ని టన్నులు జీడిపిక్కలు కొనుగోలు చేశారో.. ఎన్ని కేజీలు ప్రొసెసింగ్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులు పీవో వెంట ఉన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్

సచివాలయాల ఉద్యోగులు సకాలంలో సేవలు అందించాలి