
మహోన్నత వ్యక్తిత్వం జస్టిస్ రామస్వామి సొంతం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె. రామస్వామి చిత్రపటాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవిష్కరించారు. గతంలో జస్టిస్ కె. రామస్వామి ఏయూలో ‘పబ్లిక్ పవర్ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్’ అనే అంశంపై అందించిన ప్రసంగాన్ని పునర్ ముద్రించిన పుస్తకాన్ని కూడా జస్టిస్ బట్టు దేవానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ.. జస్టిస్ కె. రామస్వామి మహోన్నత వ్యక్తిత్వం సొంతమని కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా తాను తొలిసారిగా ఆయనను కలిసిన సందర్భం, ఏయూకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించి తీసుకువచ్చిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. జస్టిస్ రామస్వామి చారిత్రాత్మకమైన తీర్పులు అందించారని పేర్కొన్నారు. తాను ఉన్నత స్థానంలో నిలవడానికి తన గురువులు అందించిన అత్యుత్తమ బోధన, మార్గదర్శకమే కారణమని, ఈ అవకాశాన్ని దైవం ఇచ్చిన వరంగా భావిస్తున్నానని జస్టిస్ దేవానంద్ అన్నారు. ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిగా తన కళాశాల రోజులను, ప్రత్యేక న్యాయ కళాశాల ఏర్పాటుకు చేసిన కృషిని, న్యాయ కళాశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును ప్రతిపాదించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్యులకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వేదికపై స్మరించుకున్నారు. అంతకుముందు ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఎందరో న్యాయ కోవిదులను సమాజానికి అందించిందని చెప్పారు.