
ఏయూ దూర విద్య..అక్రమాల అడ్డా
ప్రైవేటుకు ఏయూ పరీక్షా కేంద్రాలు
ఇష్టానుసారంగా కేంద్రాల మంజూరు
ఒక్కో సెంటర్ నుంచి రూ.2 నుంచి రూ.5 లక్షలు వసూలు
కర్నూలు, నంద్యాలలో అక్రమంగా పరీక్షా సెంటర్ల నిర్వహణ
మాస్ కాపీయింగ్‌కు అడ్డాగా ఏయూ దూర విద్య
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వ విద్యాలయం దూర విద్యకు చెదలు పట్టింది. అధికారుల హస్తలాఘవానికి కేంద్రంగా మారిపోయింది. పరీక్షా కేంద్రాల పేరుతో అక్రమాలకు అడ్డాగా తయారైంది. ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాల వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది చేతివాటం కారణంగా ఎగ్జామినేషన్ సెంటర్లు హద్దులు దాటి ప్రైవేటు చేతికి వెళ్లిపోయాయి. ఈ ప్రైవేటు సెంటర్లు ఒక పేరుతో అనుమతి పొంది మరోచోట పరీక్షలు నిర్వహిస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రధానంగా ఈ పరీక్షల నిర్వహణపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనధికార కేంద్రాలు మాస్ కాపీయింగ్‌కు నిలయాలుగా మారిపోయాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే దూర విద్య పరీక్షా కేంద్రాలు నిర్వహించాలని ఏయూ పాలకులు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కొన్ని లొసుగులతో ఇప్పటికీ ప్రైవేటుకే పెద్ద పీట వేస్తున్నారు.
సెంటర్‌కు రూ.2 నుంచి రూ.5 లక్షలు
ఏయూ పరీక్షా కేంద్రాలను ఇష్టానుసారంగా ప్రైవేటుకు అప్పగించేశారు. ప్రైవేటు సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగిన సందర్భాలు అనేకమున్నాయి. అయినప్పటికీ పరిధి దాటి అనంతపురం, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్‌లలో కూడా ప్రైవేటు విద్యా కేంద్రాలకు పరీక్షా కేంద్రాల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసేశారు. ఇటువంటి సెంటర్లపై ఎన్ని ఫిర్యాదు వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి సెంటర్ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుని అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వాటి పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేస్తున్నారు.
ప్రైవేటు కేంద్రాలు రద్దు చేయాలని నిర్ణయించినా..
ఏయూ దూర విద్య పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రైవేటు పరీక్షా కేంద్రాల అనుమతులు రద్దు చేయాలని రెండేళ్ల క్రితమే ఏయూ అధికారులు నిర్ణయించారు. కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని భావించారు. కానీ అధికారుల బదిలీలు.. సిబ్బంది చేతివాటం.. ప్రైవేటు మామూళ్లతో ఇప్పటి వరకు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ఇప్పటికీ ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రైవేటు సెంటర్లలో నిర్వహిస్తూనే ఉన్నారు. గత నిర్ణయాలను మాత్రం అమలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆదాయం పోతుందన్న కారణంగానే ప్రైవేటు సెంటర్లను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మాస్ కాపీయింగ్‌కు కేంద్రాలుగా...
ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాలుగా ఉన్న కొన్ని ప్రైవేటు సెంటర్లు అనధికారికంగా మరికొన్ని చోట్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను నిర్వహించి అక్కడ విద్యార్థులతో పరీక్షలు రాయించి వాటిని అనుమతి పొందిన కేంద్రాల్లో నిర్వహించినట్లు చూపిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గత నెల 12వ తేదీ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇదే తరహాలో అనధికారికంగా పరీక్షలు నిర్వహించిన ట్లు సమాచారం. మరికొంత మంది ఇతర జిల్లాల్లో అనధికారికంగా పరీక్షలు రాయించి ఉత్తరాంధ్రలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్న కేంద్రాల్లో పరీక్షలు రాసినట్లు చూపిస్తున్నారని, ఇందుకు దూర విద్యా విభాగం సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.