
మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి మృతదేహం లభ్యం
ముంచంగిపుట్టు: మండలంలో వనుగుమ్మ పంచాయతీ దొమినిపుట్టు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో గల్లంతైన కిల్లో నర్సింగ్(28) అనే గిరిజనుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. చేపల వేటకు వెళ్లిన నర్సింగ్ ఈ నెల 10న గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్థానిక గిరిజనులు నాటు పడవలపై గాలించారు. అనంతరం విశాఖకు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెండు రోజులు విస్తృతంగా రెండు కిలో మీటర్ల మేర గాలించాయి. ఫలితం లేకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. 18రోజుల తరువాత ఆదివారం గిరిజనుడి మృతదేహం లభ్యమైంది. మేకల కాపర్లకు గెడ్డలో మృతదేహం తెలుతూ కనిపించింది. దిమినిపుట్టు గ్రామస్తులకు తెలియజేయడంతో వారు చూసి నర్సింగ్ మృతదేహంగా గుర్తించారు. రెవెన్యూ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆర్‌ఐలు రవికుమార్,భాస్కర్‌లు,వీఆర్‌వో విజయలక్ష్మీ,మండల వైఎస్సార్‌సీపీ నేతలు దేవా,నీలకంఠం,రాజేంద్ర,సీఐటీయూ నేత శంకర్‌రావు మత్స్యగెడ్డ నుంచి నర్సింగ్ మృతదేహానికి బయటకు తీశారు.మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉంది.పోస్టుమార్టం అనంతరం దహన సంస్కారాలు పూర్తి చేశారు.