
వెల్లువెత్తిన అర్జీలు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజనుల ఫిర్యాదులు
● ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌కు
గ్రామస్తుల వినతులు
రంపచోడవరం: రంపచోడవరం మండలం పెద్దగెద్దాడ పంచాయతీ పరిధిలో 25 మంది గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు మంజూరు చేసిన భూమి సరిహద్దులు చూపలేదని సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజనులు ఫిర్యాదు చేశారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్‌రాజ్ గ్రీవెన్స్ నిర్వహించారు. పలు సమస్యల అర్జీలను పీవోకు అందజేశారు. ఈ వారం 82 మంది అర్జీలు అందజేసినట్లు పీవో తెలిపారు. పెద్దగెద్దాడ–చెరువుపాలెం గ్రామాల మధ్య నాలుగు కిలోమీటర్లు తారురోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే 400 ఎకరాలకు సాగు నీరందించే నిమ్మల కాలువ డ్యామ్‌కు మరమ్మతులు చేయించాలని, డోకుల పాడు గ్రామంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ మార్చాలని పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కడబాల ఈశ్వరరావు, అన్నిక అప్పారావు, ఉగ్గిరాల బుల్లబ్బాయి, గంగిరెడ్డి తదితరులు కోరారు. మారేడుమిల్లి మండలం ఇవ్వంపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం ఏర్పాటు చేయాలని రేవల జానికిరెడ్డి, పల్లాల భూపతిరెడ్డి అర్జీ అందజేశారు. వై.రామవరం మండలం చింతలపూడి పంచాయతీలోని బొడ్డగుంట కన్నెరు వారుపై వంతెన నిర్మించాలని సర్పంచ్ పల్లాల సన్యాసమ్మ అర్జీ అందజేశారు. తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు డీలర్లను నియమించాలని ఎస్.సింధూ, దుర్గాదేవి, మల్లేశ్వరీలు కోరారు. 2014 నుంచి 2018 వరకు మంజూరు చేసిన గృహాల పనులు పూర్తి చేయాలని కోసు లచ్చన్నదొర పీవోకు అర్జీ అందజేశారు. ఏపీవో డి.ఎన్.వి.రమణ, ఎస్.డి.సి. పి.అంబేడ్కర్, సబ్ డీఎఫ్‌వో అనూష, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రంపచోడవరం ఐటీడీఏ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోకి వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీనిపై పీవో స్మరణ్‌రాజ్ స్పందించి వారితో మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సమస్యలతో కూడి వినతిపత్రాన్ని పీవోకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 30 ఏళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన వంట వండి పెడుతు వారి ఆరోగ్యాలను కాపాడుతూ రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారన్నారు.

వెల్లువెత్తిన అర్జీలు