
గజ్జె కట్టిన డాక్టరమ్మ
ఏయూక్యాంపస్: రోగులకు వైద్యం అందించే ఓ వైద్యురాలు నృత్య కళాకారిణిగా మారి అందరి ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ జాహ్నవి ప్రసాద్ బొడ్డేపల్లి, తాను చిన్నతనం నుంచి నేర్చుకున్న కూచిపూడి నృత్యాన్ని బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం ఆలయ కళావేదికపై ఆమె నిర్వహించిన కూచిపూడి నృత్య అరంగేట్రం ఎంతో ఘనంగా జరిగింది. గురువు లలిత గుప్తా వద్ద నృత్యాన్ని అభ్యసించిన జాహ్నవి, తన కళా ప్రతిభను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఎంతో ఒత్తిడితో కూడుకున్న వైద్య వృత్తిలో ఉంటూనే, నృత్యంపై తనకున్న ఆసక్తితో సాధన చేసి ఈ స్థాయికి చేరుకోవడం అందరికీ స్ఫూర్తినిస్తుంది.