
అసత్య ఆరోపణలు తగవు
గంగవరం: టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశ్ , వైస్ ఎంపీపీ గంగాదేవి , సర్పంచ్ కామరాజు దొర తదితరులు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావుపై టీడీపీ మండల అధ్యక్షుడు పాము అర్జున తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది మానుకోవాలని హెచ్చరించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైబడినా ప్రజా సంక్షేమాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, అరాచక పాలన సాగిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తూ, తప్పుడు ప్రచారాలను చేస్తోందన్నారు. కూటని ప్రభుత్వం నిరంకుశ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారన్నారు. వైస్ ఎంపీపీ గంగాదేవి, సర్పంచ్‌లు కామరాజు దొర, కె.లక్ష్మి , నేషం మరిడమ్మ, నాయకులు సతీష్, టి.శ్రీను, ఎం.శ్రీను, వీరబాబు, సత్తిబాబు, బాబ్జి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.