
వాడీవేడిగా సర్వసభ్య సమావేశాలు
చింతపల్లిలోని సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనూషదేవి,పక్కన జెడ్పీటీసీ బాలయ్యపడాల్, ఎంపీడీవో సీతామహాలక్ష్మి
ఎటపాకలోని సమావేశంలో వ్యవసాయాధికారిని ప్రశ్నిస్తున్న
ఎంపీటీసీ పాయం దేవి
చింతపల్లి: మండలంలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు సహకరించాలని ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్యపడాల్ అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడీఓ సీతామహాలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ శివారు గ్రామాలకు రహదారులు సౌకర్యానికి అటవీశాఖ అనుమతులు నిరాకరించడం మంచి పరిణామం కాదన్నారు.విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు విద్యాశాఖ అధికారులు పాఠశాలలను విధిగా పర్యవేక్షించాలన్నారు. లోతుగెడ్డ వంతెన నుంచి కోరుకొండ వరకు జరుగుతున్న రహదారి పనులు నిలిపివేయడంపై ఆందోళన చేస్తామని, త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తిచేయాలన్నారు.
తాజంగి బస్పు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అనూషదేవి కోరారు. బలపం–కోరుకొండ బస్ సర్వీసు సమయాన్ని మార్పుచేయాలని సర్పంచ్ కోరగా, పెద్దగెడ్డ నుండి కొండవంచులుకు బస్ పునురుద్దరించాలని ఎర్రబోమ్మలు ఎంపిటీసి సత్తిబాబు ఆర్టీసి అదికారులను కోరారు. లోతుగెడ్డలో డైరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సునిల్ కుమార్ వెలుగు ఏపీఎంను కోరారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని మంచినీటి విభాగం ఏఈని సూచించారు. వైస్ ఎంపీపీలు గోపినాయక్ శారద, వెంగళరావు, తహసీల్దార్ ఆనందరావు, ఏఎంసీ చైర్మ్‌న్ ఊర్మిళ,ఏఓ మదుసుదన్‌రావు,ఏపిఓ రాజు,ఏపీఎం ఽశ్రీనివాసరావు, ఏటీడబ్ల్యూవో నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు
ఎటపాక: కష్ట నష్టాలతో సాగు చేస్తున్న రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..వారికి మేమేం సమాధానం చెప్పాలంటూ అధికారులను ప్రశ్నించారు ప్రజాప్రతినిధులు. శుక్రవారం ఎటపాక మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కాక కామేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై సర్పంచ్‌లు,ఎంపీటీసీ సభ్యులు వివిద శాఖల అధికారులను నిలదీశారు. అరకొర యూరియా తెచ్చి రైతులను క్యూలైన్లో ఉంచి ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని గొమ్ముకొత్తగూడెం ఎంపీటీసీ పాయం దేవి వ్యవసాయశాఖ తీరుపై మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ, ఇతర పథకాలు లబ్ధిదారుల ఎంపికలో కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయశాఖ ఉద్యోగులు సర్పంచ్‌లకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని రాయనపేట, టీపీవీడు సర్పంచ్‌లు అలివేలు,రాజులు చెప్పారు. తక్కువ మోతాదులో పశుదాణ పంపిణీపై పలువురు అధికారులను ప్రశ్నించారు. తక్కువగా సరఫరా జరిగినట్టు అధికారులు సమాధానమిచాచరు. గ్రామాల్లో జల్‌జీవన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయని ,పలుచోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్యను ఎందుకు పరిష్కరించరని నందిగామ, కృష్ణవరం సర్పంచ్‌లు బాలకృష్ణ, కృష్ణ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను నిలదీశారు. తహసీల్దార్ సుబ్బారావు మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అవకతవకలు జరుగకుండా క్యూఆర్ కోడ్ ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు ఉబ్బా సుస్మిత, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

వాడీవేడిగా సర్వసభ్య సమావేశాలు