
పది రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలి
● చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్
కూనవరం: చినార్కూరు పంచాయతీ తెల్లవారి వారి గుంపు నుంచి శబరి కొత్తగూడెం వరకు వేసిన మట్టిరోడ్డు (ఫార్మేషన్ రోడ్డుపై) పది రోజుల్లో బీటీ రోడ్డు నిర్మించాలని చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని చినార్కూరు, కొత్తూరు, శబరి కొత్తగూడెం, కొండ్రాజుపేట గ్రామాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పూసుగూడెం పాఠశాల భవనాన్ని రీమోడలింగ్ చేస్తామన్నారు. కొత్తూరు నుంచి శబరి కొత్తగూడెం రచ్చబండ వరకు సీసీ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కొండ్రాజుపేట సచివాలయాన్ని ప్రారంభించే విషయంపై అధికారులతో చర్చించారు. చినార్కూరు నుంచి టేకులబోరు వరకు వరద ముంపునకు గురవుతున్న రోడ్డు మరమ్మతులు చేపడతామని చెప్పారు. శబరి కొత్తగూడెం గ్రామస్తులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి భూమికి భూమి 2వేల ఎకరాలు సేకరించామని, మిగిలిన భూమిని అడ్డతీగల, రాజవొమ్మగిలో సేకరించనున్నట్టు తెలిపారు. గిరిజన నిర్వాసితులకు స్థలాలకు బదులుగా నగదు పరిహారం అందిస్తామని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. చినార్కూరు పంచాయతీలో జెడ్, జీకి సంబంధించిన భూములు గత రెండు నెలల నుంచి వరద ముంపులో ఉన్నాయని వ్యవసాయం చేసే పరిస్థితి లేదని, వాటికి పోలవరం ప్యాకేజి ఇప్పించాలని ఎంపీపీ పాయం రంగమ్మ , సర్పంచ్‌లు సున్నం అభిరాం, కట్టం లక్ష్మి పీని కోరారు. తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య, ఐటీడీఏ ఏఈ ప్రవీణ్, మాజీ సర్పంచ్ కట్టె శ్రీను, పీసా కమిటీ చైర్మన్ కుంజా శ్రీను, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలు తదితరులున్నారు.