
వరి సాగుపై రైతులకు సూచనలు
చింతపల్లి: గిరిజన రైతాంగం వరిలో ఆశించే తెగుళ్లను అరికట్టడానికి యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులు సాదించవచ్చని వీసీఎఫ్(టాటా ట్రస్టు)వ్యవసాయ సాంకేతిక నిపుణులు డాక్టర్ కొన్ని అప్పలరాజు అన్నారు. మండలంలో కొత్తపాలెం గ్రామంలో గిరి రైతులకు వరిలో సోకే చీడ పీడల వలన నష్టాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా వరిలో సుడిదోమ వరి మొక్క మొదట్లో గుంపులు గుంపులుగా చేరి మొక్క నుంచి రసం పీల్చి పంటకు నష్టం కలిగిస్తుందన్నారు. ఈ సుడిదోమ కొన్ని రకాలైన వైరస్‌లను కూడా వ్యాప్తి చేస్తుందని, దీంతో పంట పసుపు రంగులోకి మారడం, వరి పంట సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుందన్నారు. ఈ దోమ నివారణకు పంటను వరుస పద్ధతిలో నాటుకోవాలని, సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు.పంటలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వేపాకుల కషాయం, వేప నూనె సమయానుకూలంగా పిచికారీ చేయడం వలన ఈ దోమ యొక్క వ్యాప్తిని తగ్గించవచ్చన్నారు. క్రిమి సంహారక మందులను వ్యవసాయ నిపుణులు సలహా మేరకు వినియోగించాలని సూచించారు.