
రైతులకు మొక్కల పంపిణీ
ముంచంగిపుట్టు: ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో గల దారెల పంచాయతీలో పలు గ్రామాల గిరిజన రైతులకు పెద్ద సైజు మొక్కలు పంపిణీ చేసినట్టు ఏపీవో వెంకటేశ్వర్లు తెలిపారు. దారెల పంచాయితీలో గిరిజన రైతులకు చిన్నసైజు మొక్కలు పంపిణీ చేశారని ఆరోపణలతో ఉపాధి అధికారులు స్పందించారు. ఈ నెల 7న ఢీంగూడ రైతులకు చిన్నసైజు మొక్కలు రావడంతో వాటినివెనక్కి పంపిన ఉపాధి అధికారులు పెద్ద సైజ్ మొక్కలను గురువారం రప్పించారు. ఏపీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని డి.కుమ్మరిపుట్టు, రంగలిసింగి, డొక్రిపుట్టు, దారెల, పెద్దపేట, పేటమాలిపుట్టు గ్రామాల్లో గిరిజన రైతులకు సిల్వర్‌ఓక్, మహాగని మొక్కలను పంపిణీ చేశారు.పెద్దసైజు మొక్కలు పంపిణీ చేయడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలో రైతులకు నాణ్యమైన మొక్కలు, రైతులకు ఉపయోగ పడే విధంగా పంపిణీ చేస్తున్నామన్నారు. చిన్న సైజ్, నాసిరకం మొక్కలు వస్తే రైతులు వాటిని తీసుకోవద్దని, డీంగూడ గ్రామానికి చిన్న సైజ్ మొక్కలు వచ్చినట్టు సమాచారం రావడంతో వాటిని వెనక్కి పంపించి, పెద్దసైజు మొక్కలను గిరిజనులకు అందించినట్టు ఏపీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధి హామీ పథకం అధికారులు, గిరిజన రైతులు పాల్గొన్నారు.
చిన్న సైజు మొక్కలకు బదులుగా పెద్ద సైజు మొక్కలు అందజేతకు ప్రత్యేక చర్యలు:
ఏపీవో వెంకటేశ్వర్లు