
ఆదివాసీలను జలసమాధి చేయొద్దు
● హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందం
తక్షణమే రద్దు చేయాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి
అప్పలనర్స డిమాండ్
డుంబ్రిగుడ: ఆదివాసీలను జలసమాధి చేయవద్దని, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆదివాసీ అరణ్య గర్జన జీవు యాత్రను బుధవారం మండల కేంద్రంలోని మూడు రోడ్ల జంక్షన్‌లో నిర్వహించారు. అనంతరం కండ్రుం పంచాయతీ జోడిగుడ, జాకరవలస గ్రామాల ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీతో జీపు జాత నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిఒక్క గిరిజనుడు ఈనెల 27న జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.త్రినాథ్, ఎస్‌బీ పోతురాజు, మండల నాయకులు పి.సురేష్, సత్యనారాయణ, టి. సూర్యనారాయణ పాల్గొన్నారు.