
సామాజిక సేవలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
సాక్షి, పాడేరు : విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. సమాజ అభివృద్ధికి ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఎంతో శ్రమిస్తున్నారు. నిరక్షరాస్యతతో పాటు అభివృద్ధిలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు జాతీయ సేవా పథకం ఎంతో మేలు చేస్తుంది. ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 15 ఏళ్ల క్రితం పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 100మంది విద్యార్థులతో ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ నేడు జిల్లా వ్యాప్తంగా 25 కళాశాలలకు విస్తరించింది. 2500 మంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు సమాజ అభివృద్ధిలోను భాగస్వాములవుతున్నారు. ప్రతి ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ విద్యార్థులు తమ కళాశాల పరిధిలోని పలు గ్రామాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి యూనిట్‌కు అనుభవజ్ఞులైన అధ్యాపకుడు ఎన్‌ఎస్‌ఎస్ పీవోగా పనిచేస్తున్నారు.
జిల్లాలో 25 ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు
జిల్లాలోని 22 మండలాలకు సంబంధించి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 27 ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి, పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4 యూనిట్లు, చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4, అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3, అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో 1, రంపచోడవరం డిగ్రీ కళాశాలలో 2, చింతూరు డిగ్రీ కళాశాలలో 2, కొయ్యూరు మండలం మర్రిపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2, పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల1, ఏపీఆర్1, సీలేరు జూనియర్ కళాశాల 1, పెదబయలు ఏపీఆర్ 1, హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 1, హుకుంపేట జ్ఞానప్రకాష్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 1 ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ పనిచేస్తుంది.
ప్రాణదాతలుగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
రెడ్‌క్రాస్ సొసైటీకి అనుబంధంగా ఉన్న 25 ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల విద్యార్థులు అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేస్తుండడంతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 45 రక్తదాన శిబిరాలను ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల విద్యార్థులు నిర్వహించారు. 200 యూనిట్ల వరకు రక్తం సేకరించి జిల్లాలోని రోగులకు రక్తం అందుబాటులో ఉంచారు.
గ్రామాల అభివృద్ధిపై అవగాహన శిబిరాలు
ప్రతి ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్‌ల విద్యార్థులంతా తాము దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహనతో పాటు వైద్యబృందాల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం అందించే పౌరసేవలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. తమ కళాశాలలతో పాటు దత్తత గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను ఈ ఏడాది విజయవంతంగా చేపట్టారు.
విద్యార్థి దశలో ఉన్నత సేవలు
25 ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు
గ్రామాల్లో సేవా కార్యక్రమాలు
పచ్చదనం పర్యావరణం లక్ష్యం
పరిశుభ్రత, ఆరోగ్యంపై గిరిజనులకు అవగాహన
రక్తదాన శిబిరాలతో ప్రాణదాతలు

సామాజిక సేవలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు

సామాజిక సేవలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు