
సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద శాశ్వత బేస్ క్యాంపు
చింతపల్లి: సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద అటవీ సిబ్బందితో శాశ్వత బేస్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు డీఎఫ్‌వో వై. నర్సింహరావు తెలిపా రు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గూడెంకొత్తవీధి మండలం పెదవలస రేంజి పరిధిలోని సిగనాపల్లి క్వారీలో ఎటువంటి రంగురాళ్ల తవ్వకాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తవ్వకాలు ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో చింతపల్లికి చెందిన వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. అంతేకాకుండా వీరు ప్రతిరోజు తమ కార్యాలయంలో ఉదయం, సాయంత్రం సంతకాలు తీసుకుంటున్నామన్నారు. తవ్వకాలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల మేరకు మైదాన ప్రాంతం నర్సీపట్నానికి చెందిన ముగ్గురు, తునికి చెందిన ఇద్దరికి నోటీసులు జారీ చేశామన్నారు. చింతపల్లిలో గతంలో రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించిన వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు. క్వారీ ప్రాంతంలో శాశ్వతంగా ఐదుగురితో బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తమ సిబ్బందితో 24 గంటలు గస్తీ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఈ క్వారీ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని గూడెంకొత్తవీధి తహసీల్దార్‌ను కోరామని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఈ సెక్షన్ అమల్లోకి వస్తుందన్నారు. హెచ్చరికలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో హెచ్చరించారు.
24 గంటలూ గస్తీ
144వ సెక్షన్ అమలుకు చర్యలు
తవ్వకాలు ప్రోత్సహిస్తున్నారన్నఆరోపణలపై ఐదుగురికి నోటీసులు
చింతపల్లి డీఎఫ్‌వో నర్సింహరావు