
ఏకధాటిగా భారీ వర్షం
ముంచంగిపుట్టు: మండలంలో మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తునే ఉంది. దీంతో మండల కేంద్రం నుంచి పెదబయలు, కుమడ, జోలాపుట్టు, డుడుమ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయమయ్యాయి. చోటముఖిపుట్టు, రంగన్నకొండ వంతెనలపై వరదనీరు భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. వరి పొలాలు నీటి మునిగాయి.మండలంలోని రండబయలు,బూసిపుట్టు పంచాయతీలకు వెళ్లే రహదారులు బురదమయంగా మారాయి. వాహనాలు బుదరలో కూరుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ముసురు వాతావరణం కారణంగా పలు గ్రామాల్లో గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు.
సీలేరు: ఆంధ్ర,ఒడిశా సరిహద్దుల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములతో వర్షం పడింది. దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్డులో భారీగా వర్షం పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు ఈ వర్షం ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి గిరిబాబు తెలిపారు.